Janavamsham (Telugu) By Gunturu Seshendra Sharma
మానవ సమాజంలో యుగయుగాన దీర్ఘకాలానంతరం ఐతిహాసిక కావ్యాలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. అవి తత్తద్యుగీన తత్త్వాన్ని ప్రదర్శించేవి. ఇతిహాసం యుగీనవాణి, పూర్వకాలంలో వచ్చిన ప్రతి ఇతిహాసానికి ఒక అనుబంధ కావ్యం ఉండేది – ప్రాచ్య దేశాల్లో గానీ పాశ్యాత్యదేశాలలో గానీ. వాల్మీకి రచిత రామాయణానికి ఉత్తరకాండ అనుబంధ కావ్యము. అట్లాగే వ్యాస మహాభారతానికి అనుబంధకావ్యం హరివంశమ్. ఇదేవిధంగా ప్రాచీనకాలంలో గ్రీసులో వచ్చిన జగద్విదితమైన హోమర్ విరచిత ఇలియడ్ అనే ఇతిహాసానికి అడిస్సీ అనుబంధ కావ్యం. ఇతిహాస కావ్యరచనా ప్రక్రియానుసారంగా ఆధునిక మహాభారతానికి అనుబంధకావ్యంగా ఈ జనవంశమ్ వచ్చింది.
*****
జనవంశమ్ ఆధునిక మహాభారతము కావ్యేతిహాసానికి అనుబంధ కావ్యం. ఆధునిక మహాభారతము పూర్తిగా వచనకవిత. జనవంశమ్ దీనికి భిన్నమైంది. ఇందులో ఛందోబద్ధ పద్యాలు, గేయాలు, పాటలు, వచన కవితలు, చమత్కారికలు అన్నీ ఉన్నాయి. భావతీవ్రత, అభివ్యక్తి ఉష్ణోగ్రత అదే స్థాయిలో ఉంటాయి. స్థాయీ భేదాలుండే వివిధ వర్గాల పాఠకులందరినీ తప్పక ఆకట్టుకునే మహాకావ్యం జనవంశమ్.
1. రుతువులు చెట్ల సుఖదుఃఖాలు
2. రచిత అక్షరం కంటే రాయే అతిశ్రేష్ఠము, సగటు మనిషి గతి చూస్తే ఇదే మనకు స్పష్టము
3. అడుగు నేలకు సైతం శాసనాల కంచె గట్టి నిలువ నీడ లేని దశను నెలకొల్పారంతటను.
4. ఇల్లనేది ఒక మహాగ్రంథం, సంపూర్ణ మానవుడి దేవాలయము.. ఇలా ఎన్నో ఖండికలు వైవిధ్యం విస్తృతికి అద్దం పడతాయి.
ఆధునిక మహాభారతము శ్రీ పవన్ కళ్యాణ్ అచ్చు వేయించగా, జనవంశమ్ ఆయన ఆప్తమిత్రుడు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అచ్చువేయించడం ఈ మహాకావ్యం ప్రత్యేకాకర్షణ.
*****
నగరం ఒక చంబల్ వ్యాలీ
అరే ఈ దేశం మీకేమిచ్చింది
వంకరటింకర్లుగా వంగే దేహం
బానిసత్వం మీద వ్యామోహం
మీరెగరేశే జెండా మీకేమిచ్చింది
ఐదేళ్ళ కొకసారి ఓట్లు
ఆ మధ్యలో కునికిపాట్లు
*****
పత్రిక ముట్టుకుంటే చాలు పామైకరుస్తోంది
రోడ్డుతొక్కితే చాలు బజారుకాటేస్తోంది
సూర్యుడుదయిస్తే చాలు బతుకు ఉరితాడవుతోంది
ఓట్లుమేసి బలిసిన నాయకుడి ముందు
ఏనుగంతరూపాయ ఎలుకై సలాంచేస్తోంది
*****
ఇండియాలో కుక్కలన్నీ
ఏకగ్రీవంగా అరుస్తున్నాయి
మనిషి ఒక ఓటు
దేశం నరకానికి గేటు
గంగానది ఫ్యాక్టరీల శౌచాలయం
గోదావరి కులపిశాచాల లావానలం
అరే ఈవాళ నగరం ఒక చంబల్‌వ్యాలీ
గ్రామం దేశానికి కూలీ
*****
బాబూనీ చిన్ని కన్నీటి బిందువులో
ఏ సముద్రం గర్జిస్తోందో నాకు తెలుసు
అందుకే చెట్లతో మొరపెట్టుకుంటున్నాను
ఆకులు కాదు తుపాకులు కాయండని
- శేషేంద్ర
*****
ఎన్నిరోగాలైనా సరే ఎన్నికలమందుతోనే నయంచేస్తారనే భూతవైద్యులు బాబూ దేశం నెత్తిన పెట్టారు శుష్క ప్రజాస్వామ్య శూన్యహస్తం- అంటూ మన డొల్ల స్వాతంత్య్రాన్ని నిలదీస్తూ స్వాతంత్రదినోత్సవ సందర్భంగా వస్తోంది... జనవంశమ్.