Sri Sri Jayabheri (Telugu)
'సామ్యవాదమే నా గమ్యం, కవిత్వంలోనూ జీవితంలోనూ' అన్న శ్రీశ్రీ కవిత్వం భువన భవనపు బావుటాగా ఎగురుతూనే వుంటుంది. దాని గురించి ఎంత చర్చ జరిగినా ఇంకా మిగిలే వుంటుంది. కాని కొంతమందికి ఇదే గిట్టడం లేదు.నచ్చడం లేదు. శ్రీశ్రీని పునర్మూల్యాంకనం చేయాలని వారంతా మహా తొందరలో వున్నారు. అసలు ఏ మూల్యాంకనమైనా నిరంతరం సాగుతుంటుంది తప్ప ఒక బిందువు దగ్గర ఆగిపోదు. ఆ అవసరం లేని వారిని చరిత్ర తేలిగ్గా మర్చిపోతుంది. ఎవరి గురించైనా పునర్మూల్యాంకనం జరగాలని పదే పదే అంటున్నారంటే వారి ప్రభావం నిలిచి వుందని అర్థం. విచిత్రమేమంటే శ్రీశ్రీ విషయంలో సాహిత్య పరంగా ఆయన మహత్తర పాత్రపై సంపూర్ణ మూల్యాంకనమే సరిగ్గా జరిగినట్టు కనిపించదు. తెలుగు కవిత్వాన్ని ఊగించి దీవించి శాసించిన ఆయన మహత్తర కవిత్వంపైన, జన నిబద్ధమైన ఆయన జీవితంపైన ఏకోన్ముఖ పరిశీలనే సమగ్రంగా జరిగింది లేదు. కమ్యూనిస్టు నాయకులు మాత్రమే ఆయన మహత్తర పాత్రను మనస్ఫూర్తిగా ఆహ్వానించి జేజేలర్పించారు. శ్రీశ్రీ విశ్వరూపం ఇంకా విదితం గాని తొలి రోజులలో కొంతమంది ప్రముఖులు ఆహ్వానించారు.
అత్యంత ప్రసిద్ధమైన శ్రీశ్రీ కవిత్వ విశిష్టతపైనే గాక ఆయన జీవితం, కవిత్వ పరిణామం, అభిప్రాయాలు ఆచరణ వంటి వాటిపై ప్రధానంగా ఇందులో కేంద్రీకరణ సాగింది. శ్రీశ్రీ కి సంబంధించిన విషయాలను పరిశీలించినప్పుడు వివిధ దశల్లో వివిధ రకాల శక్తులూ వ్యక్తులూ విభిన్న రీతుల్లో వ్యాఖ్యానాలు చేసిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కవిత్వం, దాని ప్రభావం గురించి మాట్లాడ్డం కన్నా ఆయన వ్యక్తిత్వంపైన శ్రుతిమించిన చర్చ సాగుతూనే వుంది. ఇలాంటి స్థితి తెలుగులో మరే కవి రచయితల విషయంలో చూడం. దీనికి శ్రీశ్రీ రాజకీయ నిబద్ధతే కారణమని చెప్పనవసరం లేదు. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే మహా మేధావులు, కళాకారులు, చిత్రకారులు, శాస్త్రజ్ఞులు ఎందరో కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఆకర్షితులవడం కనిపిస్తుంది. తెలుగు నాట ఆ విధంగా ఆకర్షితులైన వారిలో అత్యంత ప్రసిద్ధులు, ప్రతిభా వంతుడు శ్రీశ్రీ. ఈ వాస్తవాన్ని కమ్యూనిస్టు వ్యతిరేకులు గాని కమ్యూనిస్టేతరులు గాని ఎన్నడూ అర్థం చేసుకోలేకపోయారు. అందులోనూ ఆయన ప్రత్యక్షంగా కమ్యూనిస్టులతో పాటు రంగంలో నిలబడి శత్రు ప్రచారాలను ఢీ కొనడం వారికి మరీ దుర్భరంగా మారింది.
-
Author: Telakapalli Ravi
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 375 Pages
- Language: Telugu